* ఎర్ర బంతితో అద్భుతాలు చేస్తున్న అశ్విన్‌, జడేజా

0
2

అవును.. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు!

ఎర్ర బంతితో అద్భుతాలు చేస్తున్న అశ్విన్‌, జడేజా

స్వదేశంలో ఇద్దరూ కలిస్తే జట్టుది విజయాల బాట  

అవును.. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు! ఒకర్నొకరు బాగా అర్థం చేసుకుంటారు. అతడికి అవసరమైనప్పుడు ఇతడు వైవిధ్యం ప్రదర్శిస్తాడు. ఇతడు ఇబ్బంది పడుతున్నప్పుడు అతడు ముందుకొస్తాడు. పరస్పరం ప్రోత్సహించుకుంటారు. భుజం తట్టి అభినందనలు తెలుపుకొంటారు. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు ఆదుకుంటారు. సారథి నమ్మకం నిలబెట్టుకుంటారు. మరి వారిద్దరూ ప్రేమలో పడింది ఎవరితోనబ్బా అనేగా మీ సందేహం? అదేనండి ఎరుపు బంతితో..!

అవును.. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు!

రవిచంద్రన్‌ అశ్విన్‌. రవీంద్ర జడేజా. టీమిండియా సీనియర్‌ స్పిన్నర్లు. గింగిరాలు తిరిగే ఎరుపు బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. యాష్‌ బంతితో వైవిధ్యం ప్రదర్శిస్తే జడ్డూ కచ్చితమైన ప్రాంతాల్లో ఊరించే బంతులతో విసిగిస్తాడు. భారత క్రికెట్‌లో ఎందరో స్పిన్నర్లున్నా ఇలాంటి జోడీ మాత్రం అత్యంత అరుదు. ప్రేమించే ఎరుపు బంతితో నువ్వా-నేనా అన్నట్టు పోటీపడతారు. అతడు.. లేదంటే ఇతడు. నాలుగు లేదంటే ఐదు వికెట్ల ఘనత అందుకుంటారు. చాన్నాళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి సొంతగడ్డపై ఆడుతున్నారు. మరి స్వదేశంలో ఈ ద్వయం చూపిన తెగువ, 2015లో దక్షిణాఫ్రికాపై ప్రదర్శించిన బీభత్సం గుర్తుచేసుకుందామా!!


ఇద్దరుంటే గెలుపే

టీమిండియా తరఫున అత్యంత విజయవంతమైన స్పిన్‌ ద్వయం అశ్విన్‌, జడేజాదే. 2011 నవంబర్‌లో వెస్టిండీస్‌పై యాష్‌ అరంగేట్రం చేస్తే ఏడాది ఆలస్యంగా 2012 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌పై జడ్డూ కెరీర్‌ ఆరంభించాడు. ఇద్దరిదీ దూకుడు మనస్తత్వమే. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో మంచి అనుభవం ఉంది. స్వదేశీ పిచ్‌లపై పూర్తి అవగాహన ఉంది. అనుకున్నది సాధించాలన్న కసి, తపన, పట్టుదల అనే సద్గుణాలు ఉండనే ఉన్నాయి. అవసరమైతే బ్యాటుతోనూ జట్టును ఆదుకోగలరు. పైగా తప్పుల నుంచి నేర్చుకొనే తత్వం. అందుకే వీరిది స్వదేశంలో తిరుగులేని జోడీగా మారింది. గణాంకాలూ అదే చెబుతున్నాయి. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు వీరిద్దరూ కలిసి సొంతగడ్డపై 28 టెస్టులు ఆడితే 21 మ్యాచుల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 6 డ్రా అవ్వగా ఒక్క ఓటమి నమోదైంది. ఈ 28 టెస్టుల్లో అశ్విన్‌ 171 వికెట్లు తీస్తే జడ్డూ 144తో ఆకట్టుకున్నాడు.


అవును.. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు!

రికార్డుల రారాజులు

ఉపఖండం పిచ్‌లంటే చాలు చెలరేగే అశ్విన్‌, జడ్డూ విదేశాల్లోనూ తమ ప్రభావం చూపించారు. ఇంగ్లాండ్‌ వికెట్లపై జడేజాకు మంచి రికార్డు ఉంది. ఇక వెస్టిండీస్‌లో అశ్విన్‌ ఘనతలకు కొదవలేదు. కొన్నాళ్లుగా యువ స్పిన్నర్‌ కుల్‌దీప్‌కు అవకాశాలిచ్చినా అవసరమైన ప్రతి సందర్భంలోనూ జట్టు యాజమాన్యం ఈ సీనియర్లకే ఓటేస్తోంది. ప్రస్తుతం యాష్‌ ఓ అద్భుతమైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి పోరులో 8 వికెట్లు తీస్తే అత్యంత వేగంగా టెస్టుల్లో 350 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్‌తో సమంగా నిలుస్తాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య 66 టెస్టుల్లో ఈ ఘనత అందుకున్నాడు. అశ్విన్‌ 65 టెస్టుల్లో 25.43 సగటు, 2.84 ఎకానమీతో 342 వికెట్లు తీశాడు. 2016లో అత్యధికంగా 72 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ గణాంకాలూ తక్కువేమీ కావు. 43 టెస్టుల్లో 23.89 సగటు, 2.40 ఎకానమీతో 198 వికెట్లు సాధించాడు. విశాఖ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసి అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 2017లో అతడు అత్యధికంగా 54 వికెట్లు పడగొట్టాడు.


అవును.. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు!

నిద్రలేని రాత్రులు

నాలుగేళ్ల తర్వాత సఫారీలు భారత్‌లో కాస్త భయంభయంగా పర్యటిస్తున్నారు. ఎందుకంటే 2015లో అశ్విన్‌, జడ్డూ గింగిరాల బంతులతో వారు నిద్రలేని రాత్రులు గడిపారు. వన్డే, టీ20 సిరీస్‌లు గెలిచిన ఊపు మీదున్న దక్షిణాఫ్రికా 3-0 తేడాతో టెస్టు సిరీస్‌ చేజార్చుకొని ఘోర ఓటమి చవిచూసింది. అప్పటికి సుదీర్ఘ ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌ వన్‌ కావడం గమనార్హం. మొహాలిలో జరిగిన తొలిటెస్టులో జడ్డూ, యాష్‌ చెరో 8 వికెట్లు తీశారు. వర్షంతో ఒకే రోజు వీలై డ్రాగా ముగిసిన చిన్నస్వామి టెస్టులో వీరిద్దరూ చెరో 4 వికెట్లు పంచుకున్నారు. నాగ్‌పుర్‌  టెస్టులో అశ్విన్‌ తన ప్రతాపం చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగాడు. డీన్‌ ఎల్గర్‌, ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌, డుప్లెసిస్‌ వంటి క్రికెటర్లు అతడి ధాటికి విలవిల్లారు. జడ్డూ 4 తీశాడు. ఈ టెస్టులో రెండు జట్లలో ఒక్కరూ అర్ధశతకం చేయలేదు. ఆటలో రెండో రోజు 20 వికెట్లు పడ్డాయి. చివరి టెస్టులోనూ ఈ ద్వయం 14 వికెట్లు తీసింది. మొత్తంగా ఈ సిరీస్‌లో యాష్‌ 31, జడ్డూ 23 వికెట్లు తీసి సఫారీలకు చుక్కలు చూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here