* తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

0
3

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

హైదరాబాద్‌: దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు దిగగా, ఈ ఉదయం నుంచి ఒక్క బస్ కూడా రోడ్డెక్కలేదు. కార్మిక సంఘాలతో త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సమ్మెకు దిగిన కార్మికులు, నిన్నటి నుంచే దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల విధుల నుంచి వైదొలగారు. ఇక గత అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. నిన్న ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన తరువాత, అత్యవసరంగా సమావేశమైన ఆర్టీసీ జేఏసీ, ఉద్యోగులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, విధుల్లోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకునేందుకు శాంతియుత నిరసనలు తెలియజేయాలని అన్నారు.

ఇక హైదరాబాద్ లో సిటీ బస్సులు ఈ ఉదయం నుంచే డిపోలకే పరిమితం కాగా, రేపు జరగనున్న సద్దుల బతుకమ్మ, దసరా పర్వదినాల నిమిత్తం గ్రామాలకు బయలుదేరిన వారంతా వివిధ బస్టాండ్లలో పడిగాపులు పడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో, ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయివేట్‌ సిబ్బందితో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.కాగా, ఈ ఉదయం 2,600 అద్దె బస్సుల కోసం తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. దసరా సెలవులు ముగిసేంత వరకూ స్కూల్ బస్సులను సిటీ సర్వీసులుగా తిప్పాలని నిర్ణయించింది. నగర శివార్ల వరకే పరిమితమైన సెవెన్ సీటర్ ఆటోలను నగరంలోకి అనుమతించారు. ఇక విధుల్లో చేరేందుకు నేటి సాయంత్రం 6 గంటల వరకూ ప్రభుత్వం డెడ్ లైన్ విధించడంతో, అప్పటివరకూ కొంత ప్రతిష్ఠంభన, ఇబ్బందులు ఉంటాయని, ఆ తరువాత, పలువురు విధుల్లోకి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here