రగులుతున్న ఇరాక్‌

0
3

రగులుతున్న ఇరాక్‌

– నాలుగు రోజుల్లో 34 మంది మృతి, వేల మందికి గాయాలు
– ఐరాస ఆందోళన

బాగ్దాద్‌, అక్టోబర్‌ 4: ప్రజాగ్రహంతో ఇరాక్‌ రగులుతున్నది. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, కనీస సౌకర్యాల లేమిని నిరసిస్తూ వరుసగా నాలుగో రోజు కూడా ప్రజలు ఆందోళనబాట పట్టారు. శుక్రవారం రాజధాని బాగ్దాద్‌లో గుమిగూడిన నిరసనకారులపై పోలీసులు, సైనికులు కాల్పులు జరిపారు. మంగళవారం బాగ్దాద్‌లో మొదలైన నిరసనలు షియా ప్రాబల్య ప్రాంతాలకు వ్యాపించాయి. పలు చోట్ల ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు కాల్పులకు దారితీశాయి. నాలుగు రోజుల్లో మృతుల సంఖ్య 34కు చేరగా వేల సంఖ్యలో గాయపడ్డారు. నిరసనలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా పలు నగరాల్లో కర్ఫ్యూ విధించడంతోపాటు దేశవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. దేశ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని షియా మత గురువు అయాతుల్లా అలీ సిస్తానీ సూచించారు. ప్రజా సేవలను మెరుగుపర్చాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, అవినీతిపరులను జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు.

ఇండ్లకు వెళ్లిపొండి.. మీ డిమాండ్లు తీరుస్తాం: ప్రధాని అదిల్‌

ఇరాక్‌ ప్రధాన మంత్రి అదిల్‌ అబ్దెల్‌ మహ్దీ శుక్రవారం తెల్లవారుజామున దేశ ప్రజలనుద్దేశించి టీవీలో ప్రసంగించారు. నిరసనకారులంతా తమ ఇండ్లకు వెళ్లిపోవాలని కోరారు. ‘మీ డిమాండ్లు విన్నాం. తీర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని భరోసా ఇచ్చారు. పేద కుటుంబాలకు నెలవారీ భత్యం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సంక్షోభం కొనసాగితే దేశానికే నష్టమని, అందుకే కర్ఫ్యూ విధించినట్లు అదిల్‌ చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

కాల్పులపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించండి: ఐరాస

పోలీసుల కాల్పుల్లో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందడంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని ఐరాస మానవ హక్కుల విభాగం ఇరాక్‌ను కోరింది. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా, శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునేలా చూడాలని ఆ కార్యాలయ ప్రతినిధి మార్తా హుర్తాడో జనీవాలో మీడియాతో అన్నారు. మానవ హక్కుల నిబంధనలను పాటించాలని ఆమె సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here