* గాందర్బల్‌ అడవుల్లో ఏం జరుగుతోంది..?

0
3

గాందర్బల్‌ అడవుల్లో ఏం జరుగుతోంది..?

హెలికాప్టర్లలో చేరుకుంటున్న అత్యున్నత దళాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కశ్మీర్‌లో భద్రతా దళాలు పెద్ద ఆపరేషన్‌కు తెరతీశాయి. దీనికి సంబంధించి పదిరోజులుగా వేగంగా పావులు కదుపుతున్నాయి. కశ్మీర్‌లోని చిక్కటి గాందర్బల్‌ అడువుల్లోకి అత్యున్నత బలగాలను హెలికాప్టర్ల నుంచి దించుతున్నాయి. ఆపరేషన్‌ వివరాలపై సైన్యం నోరుమెదపడంలేదు. ఇటీవల ఈ అడువుల్లో ఇద్దరు అనుమానితులను బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. నాటి నుంచి గాలింపును మరింత వేగవంతం చేశాయి. ఈ ప్రదేశానికి వెళ్లేందుకు ఎటువంటి రోడ్లు లేవు. దీంతో దళాలను వేగంగా అక్కడకు చేర్చేందుకు ఎయిర్‌ లిఫ్ట్‌ మార్గాన్ని ఎంచుకొన్నాయి. భారీ ఉగ్ర సమూహం..?
ఇటీవల గాందర్బల్‌ అడవుల్లో పహారా కాస్తున్న సైనిక దళానికి ఒక భారీ ఉగ్ర సమూహం కనిపించింది. వాస్తవంగా కనిపించిన దాని కంటే ఈ గ్రూప్‌ ఇంకా పెద్దదిగా ఉండే అవకాశం ఉందని బలగాలు అనుమానిస్తున్నాయి. బందిపోరాలోని మారుమూల ప్రాంతమైన గురేజ్‌ వద్ద పాక్‌ నుంచి వీరు భారత్‌లోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. వీరంతా ఉగ్రవాదుల తొలి మజిలీ అయిన దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌ వైపు వెళుతున్నట్లు గుర్తించారు. సెప్టెంబర్‌ 27న తొలి ఆపరేషన్‌ నిర్వహించిన సైన్యం ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టింది. మరో మూడు రోజుల తర్వాత మరో ఉగ్రవాదిని హతమార్చింది. 2014 తర్వాత ఈ అడవుల్లో జరిగిన భారీ అపరేషన్‌ ఇదే.
అదో దుర్భేద్యమేన కారడవి..
గాందర్బల్‌ పర్వాతాలు అడవులతో నిండిన దుర్భేద్యమైన ప్రదేశం. ఉగ్రవాదులు ప్రవేశించిన గురేజ్‌-గాందర్బల్‌ మధ్య ఒక మంచి నీటి సరస్సు ఉంది. శ్రీనగర్‌ చుట్టుపక్క ప్రాంతాలను ఈ పర్వతాలు కలుపుతుంటాయి. ఈ సరస్సు విదేశీ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ ట్రెక్కింగ్‌, క్యాంపింగ్‌ నిర్వహిస్తుంటారు. ఓ వైపు సైనిక ఆపరేషన్‌ జరుగుతున్నా.. మరోపక్క విదేశీ పర్యాటకులు వస్తూనే ఉన్నారు. దీంతో అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించే వారి వివరాలను నమోదు చేసుకొంటున్నారు. ఇక్కడ కొండలను ఎక్కి ప్రయాణిస్తే 7 గంటల్లో త్రాల్‌ను చేరుకోవచ్చు. ఉగ్రవాదులకు అది తొలి మజిలీగా పేరుంది. ఈ ప్రదేశంలోని రోడ్డు నారంగ్‌ అనే గ్రామం వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి 17 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే ప్రస్తుతం సైన్యం ఆపరేషన్‌ చేపట్టిన ప్రదేశం వస్తుంది. దీంతో సైన్యం ఛాపర్లను ఉపయోగిస్తోంది.
ఎన్‌కౌంటర్‌ సమాచారం సౌదీకి ఎలా చేరింది..?
ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను తెచ్చేందుకు సైన్యానికి, స్థానికులకే దాదాపు ఒక రోజు పట్టింది. మృతుల్లో ఒకరైన కమర్‌ ఉద్దీన్‌ గత ఏడాది ఏప్రిల్‌లో నేపాల్‌ వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వాఘా సరిహద్దు నుంచి పాస్‌పోర్టుతో పాక్‌కు వెళ్లినట్లు గుర్తించారు. ఉత్తర కశ్మీర్‌కు చెందిన ఈ యువకుడు ఉగ్రవాదిగా ఇప్పుడు అనధికారికంగా ఎల్‌వోసీ దాటి వచ్చి ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఉగ్రవాది కుటుంబం ప్రకటించింది.
ఇక్కడ ఒక విషయం సైన్యాన్ని ఆశ్చర్యపర్చింది. ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్‌ సర్వీసులు అందుబాటులో లేనిచోట మారుమూల అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ వివరాలు ఉగ్రవాది కుటుంబానికి ఎలా చేరాయో తెలిసి బిత్తరపోయింది. ఎన్‌కౌంటర్‌ వివరాలను సౌదీ అరేబియాలోని ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆ వివరాలను దిల్లీలోని ఉగ్రవాది బంధువు చూసి ఆ కుటుంబానికి సమాచారం అందజేశాడు. అసలు సౌదీవరకు ఈ వివరాలు ఎలా వెళ్లాయో తెలియాల్సి ఉంది.
ఆ ఎనిమిది తాలూకాల్లో త్రాల్‌ కూడా ఒకటి..
కశ్మీర్‌ లోయలో రైస్‌బౌల్‌గా పేరున్న మొత్తం ఎనిమిది తాలూకాల్లో ఉగ్రవాదానికి భారీగా మద్దతు లభిస్తోంది. పుల్వామా, పామ్‌పొరా, రాజ్‌పొరా, కాకాపొరా, త్రాల్‌, షహోరా, అవంతిపురా, అరిపాల్‌ ప్రాంతాలు కరడుగట్టిన ఉగ్రవాద స్థావరాలుగా మారిపోయాయి. సైన్యం కూడా ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి పెట్టింది. దీంతో ఇక్కడ భారీ ఎన్‌కౌంటర్లు తరచూ చోటుచేసుకుంటాయి. లష్కరే తోయిబా కశ్మీర్‌ చీఫ్‌ అబూ ఖాసీంను దళాలు ఇక్కడే మట్టుబెట్టాయి. అప్పట్లో అల్లరి మూకలు భారీ ఎత్తున భద్రతా దళాలపై దాడులకు ఇక్కడే దిగాయి.
పుల్వామా, అవంతిపురా పోలీస్‌ డివిజన్లు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా పుల్వామాలో ఉగ్రదాడులు, బ్యాంక్‌ దోపిడీలు, దళాల నుంచి ఆయుధాలు లాక్కొనే సంఘటనలు, సైనిక దళాల కాన్వాయ్‌లను, క్యాంపులను లక్ష్యంగా చేసుకొని దాడులలాంటి ఘటనలు ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ సీఆర్‌పీఎఫ్‌పై భారీ దాడులు చోటుచేసుకొన్నాయి. అందుకే కమరాయ్‌ పొరా, కరీమాబాద్‌, సంబూరా, లెల్‌హార్‌, తహబ్‌, అగ్లార్‌, లిట్టర్‌, బమ్ను, కోయిల్‌ ప్రాంతాల్లో అడుగు పెట్టేందుకు భద్రతా దళాలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. ముఖ్యంగా స్థానికుల నుంచి ఎదురయ్యే ప్రతిఘటనతోనే ఇబ్బంది. ఉగ్రవాదులను భద్రతా దళాలు తేలిగ్గా ఎదుర్కొంటాయి. కానీ ఆ తర్వాత అల్లరి మూకల దాడుల కారణంగా అమాయాక ప్రజలు గాయాల పాలవుతుండడం అసలైన ఇబ్బంది.
దాదాపు 90 మంది ఉగ్రవాదంలోకి..
2016లో హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత ఈ ప్రాంతం నుంచి ఏడాదిలో దాదాపు 90 మంది ఉగ్రవాదులుగా మారినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల అంచనా. మరోపక్క విదేశీ ఉగ్రవాదులకు పుల్వామా జిల్లా అతిథ్య ప్రాంతం. సమీపంలోని బుద్గామ్‌ జిల్లాలోని పఖర్‌పొరా నుంచి వారు పుల్వామాలోకి ప్రవేశించి ఆశ్రయం పొందుతుంటారు. ఈ జిల్లాలో విస్తరించి ఉన్న యర్వాన్‌ అరణ్యాలు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉపయోగపడతాయి. వీరికి దళాల కదలికలను ఎప్పటికప్పుడు అందజేయడానికి ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో కొరియర్లు ఉన్నారు. దీంతోపాటు దళాలు వచ్చినప్పుడు ఉగ్రవాదులు తేలిగ్గా బుద్గామ్‌ లేదా అనంతనాగ్‌, షోపియన్‌ ప్రాంతాలకు పారిపోయేలా సాయం చేస్తారు. అందుకే ఇప్పుడు భారత్‌ భద్రతా దళాలు ఉగ్రవాదుల పుట్టగా పేరున్న పుల్వామాపై దృష్టిపెట్టాయి.
ఈ రెండు నెలల్లో కశ్మీర్లో దాదాపు 450 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు దళాలు గుర్తించాయి. దీంతో 650 గాలింపు ఆపరేషన్లను చేపట్టాయి. మూడు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొన్నాయి. 60 మంది ఉగ్రవాదులు సరిహద్దు దాటినట్లు భారత అధికారులు బలంగా నమ్ముతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here