మగాళ్ల గుప్పిట్లోనే సినిమా ఉంది

0
2

మగాళ్ల గుప్పిట్లోనే సినిమా ఉంది

Nayantara Interview Special Story - Sakshi

సినిమా: సినిమా మగాళ్ల కట్టుబాటులోనే ఉంది అని అగ్రనటి నయనతార పేర్కొంది. సంచలన నటి ఈ బ్యూటీ. ఆది నుంచి తన సత్తా చాటుకుంటూ నటిగా ఎదుగుతూనే ఉంది. ఆరంభంలో అందాలారబోతల్లో హద్దులు దాటినా, ఒక స్థాయికి వచ్చిన తరువాత ఎక్స్‌పోజ్‌ కంటే ఎక్స్‌ప్రెషన్‌కే ప్రాధాన్యత నిస్తూ వచ్చింది. అందుకే అగ్రనటి, లేడీ సూపర్‌స్టార్, సౌత్‌ ఇండియన్‌ నంబర్‌ఒన్‌ హీరోయిన్‌ వంటి పట్టాలను సొంతం చేసుకోగలిగింది. తాజాగా మరో ప్రత్యేకతను చాటుకుంది. అదే వోక్‌ అనే ఉత్తరాదికి చెందిన ప్రముఖ మాసపత్రిక ముఖ చిత్రంపైకి ఎక్కింది. విశేషం ఏమిటంటే ఈ పత్రిక ముఖ చిత్రంలో ఇప్పటి వరకూ ఏ దక్షిణాది హీరోయిన్‌ మెరవలేదు. అందరూ బాలీవుడ్‌ భామల ఫొటోలనే ముఖచిత్రంగా ప్రచురించారు. అలాంటిది మొట్టమొదటి సారి దక్షిణాదికి చెందిన నయనతార ఆ పత్రిక ముఖ చిత్రంలోకెక్కింది. దీని కోసమే ఇటీవల నయనతార స్పెషల్‌ ఫొటో సెషన్‌కు టైమ్‌ కేటాయించింది. అంతే కాదు ఆ పత్రికకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.

అందులో ఈ సంచలన నటి చెప్పిన విషయాలను కొన్ని చూద్దాం. సినిమా అన్నది పూర్తిగా మగాళ్ల గుప్పిట్లోనే ఉంది. అయినా నా వరకూ నేను సర్దుకుపోలేదు. నా ఇష్టానికే కథలను ఎంపిక చేసుకుంటున్నాను. షూటింగ్‌లకు వెళ్లడం, కాస్ట్యూమ్స్‌ ధరించడం, మేకప్‌ వంటి విషయాల్లో నేనే నిర్ణయం తీసుకుంటాను. అయితే కొన్ని సందర్భాల్లో తనను మీరి కథానాయకుల కోసం గ్లామర్‌ దుస్తులను ఒత్తిడి ఎదురవుతుంటుంది. ఎన్నిసార్లు నో అని చెప్పగలగం. ఏకాంతాన్ని ఇష్టపడే నేను టీవీల్లో ప్రసారం అయ్యే నేను నటించిన పాటలను, ఇతర సన్నివేశాలను కూడా చూడడం లేదు. ఈ లోకం నా గురించి ఏ అనుకుంటుందన్న విషయం గురించిన చింతే లేదు. ఒకటి రెండు సార్లు నా మాటలను వక్రీకరించడంతో గత 10 ఏళ్లుగా నేను ఎవరికీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదు. చిత్రాల్లో నటించడమే నా పని. అది మట్టుకు సక్రమంగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నాను అంటూ 10 ఏళ్ల తరువాత తన మనసులోని భావాలను పంచుకుంది సంచలన నటి నయనతార.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here