సద్దుల బతుకమ్మ సంబురం

0
2

 

సద్దుల బతుకమ్మ సంబురం

-తెలంగాణ ఇంటింటా పూలజాతర
-ఆటపాటలతో హోరెత్తిన ట్యాంక్‌బండ్
-పల్లె పల్లెన ఆడిపాడిన ఆడబిడ్డలు
-వైభవంగా ముగిసిన పండుగ

తెలంగాణలో ఆడబిడ్డలు తొమ్మిది రోజులపాటు పూల జాతరతో జరుపుకున్న బతుకమ్మ పండుగ ఆదివారం సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగిసింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా పల్లె, పట్నం, ఊరూ, వాడా, తంగేడు, గునుగు పువ్వుల వనాలయ్యాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ విద్యుత్ దీపకాంతుల్లో వెలిగిపోయింది.
Bathukamma1
నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: సద్దుల బతుకమ్మ పండుగ ఆదివారం సంబురంగా ముగిసింది. తెలంగాణ ఇంట ఆడబిడ్డలు తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో ఆనందంగా జరుపుకొన్నారు. పల్లె, పట్నం, ఊరూ, వాడా తంగేడు, గునుగు పువ్వుల వనాలయ్యాయి. చిన్నా, పెద్దా తేడాలేకుండా ఆడబిడ్డలు రామ రామ రామ ఉయ్యాలో.. తొమ్మిది రోజులు ఉయ్యాలో.. అంటూ ఆడిపాడారు. తొమ్మిది రోజుల పూలజాతరలో చివరిరోజు మల్లొచ్చె పండుగకు మళ్లొస్తానంటూ.. ముప్పై మూడు జిల్లాల తెలంగాణ బిడ్డలకు దీవెనలు ఇస్తూ బతుకమ్మ.. గంగమ్మ ఒడికి చేరింది.

ఎల్బీ స్టేడియం నుంచి బతుకమ్మ ఊరేగింపు

సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ విద్యుత్ దీపకాంతుల్లో వెలిగిపోయింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన బతుకమ్మ శకటాలను ఎల్బీనగర్ స్టేడియం వద్ద సీఎం కేసీఆర్ సతీమణి శోభ ప్రారంభించారు. సాంస్కృతిక కళారూపాలతో, పెద్దఎత్తున డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలతో ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌వరకు ఊరేగింపు కళాత్మకంగా సాగింది. రాత్రి పొద్దుపోయేవరకు ట్యాంక్‌బండ్‌పై ఆడబిడ్డలు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, హోంమంత్రి మహమూద్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
Bathukamma2
వరంగల్ నగరంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. వేల మంది మహిళలు హన్మకొండలోని పద్మాక్షి గుండం, వరంగల్‌లోని రంగసముద్రం వంటి ప్రాంతాల్లో ఆడిపాడారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సద్దుల పండుగ ఉత్సాహంగా సాగింది. పలు ప్రాంతాల్లో ఉత్తమ పాట, ఆటలకు బహుమతులు ప్రకటించడంతో ఆడిపాడేందుకు యువతులు పోటీపడ్డారు.
Bathukamma3
Bathukamma4
Bathukamma6
Bathukamma5
Bathukamma8
Bathukamma9
Bathukamma7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here